చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాం: 'మహానాడు'లో పెమ్మసాని

  • మహానాడులో పెమ్మసాని ప్రసంగం
  • అమరావతికి కేంద్రం రూ.15,000 కోట్లు కేటాయించిందన్న పెమ్మసాని
  • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
  • విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్ల కేంద్ర సహాయం అందిందని వివరణ
రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి అని నమ్మిన నాయకుడు చంద్రబాబు అని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పూర్తి అండగా నిలుస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరుగుతున్న మహానాడు-2026 రెండో రోజున 'రాష్ట్రానికి కేంద్ర సహాయం' అనే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.15,000 కోట్లు కేటాయించినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

గత ప్రభుత్వం సంకెళ్లతో బంధించిన అమరావతిని, తమ సంకల్పంతో సాధించుకున్నామని, చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చామని పెమ్మసాని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి 30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. 2014-19 మధ్య 70 శాతం పనులు పూర్తయితే, గత వైసీపీ ప్రభుత్వం కేవలం 5 శాతం పనులు మాత్రమే చేసిందని విమర్శించారు.

ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కోసం కేంద్రం రూ.11,400 కోట్లు సాయం చేసిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని, కూటమి ప్రభుత్వం రూ.12,000 కోట్లు చెల్లించి 82 కేంద్ర పథకాలను పునరుద్ధరించిందని వివరించారు.
గడిచిన రెండేళ్లలో రాష్ట్రానికి రూ.20,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, 16 వందే భారత్ రైళ్లు, 73 అమృత్ భారత్ స్టేషన్లు తీసుకొచ్చామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.600 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రూ.4,000 కోట్లతో పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Pemmasani Chandrasekhar
Amaravati
Andhra Pradesh
Central Assistance
Polavaram Project
Visakha Steel Plant
Mahanadu 2026
NTR Bhavan
Bhogapuram Airport
Central Government Schemes

More Telugu News